Thursday, December 8, 2011

అబౌట్ అయ్యప్ప స్వామి

అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
మహిషి కధనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విదంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ వీరపాండ్య చక్రవర్తి, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. ఒంటరిగా వున్న, అమిత తేజోసంపన్నుడైన బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. అతని తల్లితండ్రులెవరైనా వున్నారేమో అని అడవంతా గాలిస్తాడు. ఎక్కడా ఆచూకీ దొరక్క పోవడంతో సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బాలుడు చిన్నప్పుడే ఎన్నో మహిమలతో అందర్నీ ఆశ్చక్యచకితులను చేస్తాడు. పులిని వాహనంగా చేసుకుని తిరుగుతూ, ఘోరమైన ఆపదలలో చిక్కుకున్న వారిని అతిధైర్యంతో, సాహసోపేతమైన యుద్ధాలతో రక్షిస్తూ పాండ్యచక్రవర్తికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తాడు. అతి ప్రమాదకరమైన విషజంతువులన్నీ అతనికి లొంగిపోయి, అణిగిమణిగి వుంటాయి.

మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా' అని మరికొందరు 'అప్పా' అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. 'అయ్యా' అంటే తండ్రి, 'అప్ప' అంటే అన్న అని అర్థాలు వుండటం చేత ఒక పెద్ద అన్నగా, తండ్రిగా ఆ రాజ్యం మొత్తానికే 'అయ్యప్ప స్వామి'గా భావింపబడ్డాడు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేఖ తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాది తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని రాజ్యాధికారం మీద, భోగభాగ్యాల మీద ఏ మాత్రం మమకారం లేదనీ, వీరపాండ్యచక్రవర్తికీ, ఆయన పట్టమహిషికీ పుట్టిన పట్టికే పట్టాభిషేకం చేయడం ధర్మం అని చెప్పి చక్రవర్తిని ఒప్పిస్తాడు. తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్లి తపస్సు చేసుకుంటాననీ, తనను శరణుకోరి వచ్చే భక్తులను సదా కాపాడుతూ వుంటాననీ పాండ్యరాజుకి వాగ్దానం చేస్తాడు. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది. తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం! ఈ విధంగా, యుగాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, అభిరుచులు మారుతున్నా, 'అయ్యప్పస్వామి' తమ తండ్రి కాని తండ్రి పెంపుడు తండ్రి అయిన పాండ్యరాజుకిచ్చిన వాగ్దానాన్ని ఈ నాటికీ, సదా నిలబెట్టుకుంటూనే వున్నాడు.

బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు తెలియజేశాడు. అది రుజువవుతోంది.

అందుకే అయ్యప్పస్వామి దీక్షాపరులు అధికసంఖ్యలో శబరిమలై తరలి వెడుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, 'అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!
ఒక సంవత్సరకాలంలో కనీసం 'మండలదీక్ష' (41 రోజులు) నిష్ఠగా పాటిస్తూ దురలవాట్లకీ, వ్యసనాలకీ దూరంగా వుంటూ సంసారబంధాల నుండి బయిటికి వచ్చి నిత్యనామస్మరణతో తనను ఆరాధించే వారికి జీవితాంతం సుఖసంతోషాలు కలిగిస్తూ ఆపదలు తొలగిస్తూ ఆదుకుంటానని చెప్పి భక్తుల పాలిటి కల్పవృక్షమై అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్వామి దీక్షాపరులకు అనేక దివ్యమైన అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నాయి.

శా: అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.

0 comments:

Post a Comment